చలికాలంలో లభించే తేగలకు మంచి డిమాండ్ ఉంది.
ఉండ్రాజవరం మండలంలో పలు గ్రామాల్లో తేగల రుచి బావుంటుందని ప్రజలు భావిస్తారు.ఉండ్రాజవరం మండలంలో పాలంగి, చివటం, ఉండ్రాజవరం, దమ్మెన్ను, వేలివెన్నుతో పాటు పెరవలి మండలం కానూరు, ముక్కమల, పెరవలి, అన్నవరప్పాడు తదితర గ్రామాల్లో తేగల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్‌లో తేగలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
తేగ బాగా ఊరటంతో పాటు రుచిగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత. నిడదవోలు నియోజకవర్గంలో సుమారు 100 కుటుంబాలు ఏటా ఈసీజన్‌లో తేగల విక్రయాలతో ఉపాధి పొందుతున్నారు. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు తేగల విక్రయాలు జోరుగా సాగుతాయి. పెద్ద సైజు తేగల కట్ట రూ.50 నుంచి రూ.100, చిన్న సైజు తేగల కట్ట రూ.20 వ్యాపారులు విక్రయిస్తున్నారు.జీర్ణశక్తి మెరుగ య్యేందుకు తేగలు దోహదపడతాయని కొనుగోలుదారుల నమ్మకం. తేగలను బాగా ఉడికించి,మిరియాలు, ఉప్పు రాసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.